ఆంధ్రప్రదేశ్

చికెన్‌పాక్స్‌ నివారణకు మార్కెట్‌లో వ్యాక్సిన్‌లు అందుబాట్లో…….

chikenfox-vacsine
చికెన్ పాక్స్‌నే కొన్ని ప్రాంతాల్లో ఆటలమ్మగా పిలుస్తారు. శాస్త్రీయ పరిభాషలో చికెన్‌పాక్స్‌గా పిలుస్తారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి. పాఠశాలలో ఓ విద్యార్థిలో చికెనపాక్స్‌ను గుర్తించే లోపే పది మంది దీని బారిన పడుతున్నారు. సాధారణంగా ఆటలమ్మ బారిన పడిన వారిని ఇతరులకు దూరంగా ఉంచాలి. వ్యాధి తగ్గే వరకు ఇంటిలోనే ఉంచి విశ్రాంతి కల్పించాలి. పూర్తిగా వ్యాధి తగ్గిన తర్వాతే పాఠశాలకు పంపాలి. కానీ జిల్లాలో పలు పాఠశాల యాజమాన్యాలు మాత్రం ఇలాంటి పిల్లలకు సెలవులు మంజూరు చేయడం లేదు. పరీక్షలు జరుగుతున్నాయంటూ చికిత్సలు చేసి పరీక్షకు పంపాలని తల్లిదండ్రులను ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది.వెరిసెల్లా జోస్టర్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన పది నుంచి 14 రోజుల్లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి బారిన పడిన పిల్లల్లో జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై నీటి గుల్లలు(బ్లిస్టర్స్‌) ఏర్పడతాయి. ఇవి 5 నుంచి 7 రోజుల పాటు ఉండి తర్వాత తగ్గుముఖం పడతాయి. బ్లిస్టర్స్‌ వల్ల ఒంటి దురద ఉంటుంది. డాక్టర్ల సలహా మేరకు కేలమిన్‌ లోషన్‌ వాడొచ్చు. చికెన్‌పాక్స్‌ సోకిన పిల్లలకు ఏస్ర్పిన్‌ వంటి మందులు వాడకూడదు. కొందరు పిల్లల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.చికెన్‌పాక్స్‌ వేగంగా వ్యాపించే అంటువ్యాధి. సాధారణంగా ఏడాది నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లల్లో శరీరంపై నీటి బొబ్బలు కనిపించడానికి ముందు వైరస్‌ ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలను అంటుకున్నా, వారు దగ్గినా, తుమ్మినా వైరస్‌ గాలిలో ప్రయాణించి సులువుగా ఇతర పిల్లలకు వ్యాపిస్తుంది. అరుదుగా యువకులు, పెద్ద వారిలో కూడా కనిపిస్తుంది. ఒకసారి వ్యాధి బారిన పడిన వారికి మరలా జీవితంలో రెండోసారి వచ్చే అవకాశం తక్కువ.చికెన్‌పాక్స్‌ తరుణ వ్యాధి. వారం రోజుల్లో తగ్గిపోతుంది. దీనికి ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు. వ్యాధి తగ్గిన తర్వాత కొద్ది రోజుల్లో శరీరంపై ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి. ఏడాదిలోపు పిల్లలు, 12 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడితే వైద్యుల సలహా మేరకు మందులు వాడటం మంచిది.చికెన్‌పాక్స్‌ నివారణకు మార్కెట్‌లో వ్యాక్సిన్‌లు అందుబాట్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకుంటే వ్యాధి నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాక్సినేషన్‌ చేసినా అరుదుగా కొందరిలో చికెన్‌పాక్స్‌ సోకుతుంది. అయితే వీరిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. శరీరంపై ఏర్పడిన బొబ్బలు తగ్గే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. బొబ్బలను చిదపటం, గిల్లడం చేయకూడదు. అలా చేస్తే శరీరంపై శాశ్వతంగా మచ్చలు ఏర్పడతాయి.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>