Breaking News,

ఆయా కాదు రాక్షసి

child-collage

డబ్బుతో ప్రపంచంలో దేన్నయినా కొనొచ్చేమోగానీ, అమ్మ ప్రేమను కొనలేమన్నది నానుడి. అమ్మలా ప్రేమను పంచకపోయినా ఫరవాలేదు, కృూరత్వం ప్రదర్శించకపోతే చాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో పట్టణాల్లో భార్యాభర్తలిద్దరూ పని చేస్తే తప్ప సంసారం ఈదలేని పరిస్థితులొచ్చాయి. దీంతో కన్నపేగు మమకారం, ప్రేమ, లాలన, ఆప్యాయతల్ని డబ్బుతో కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పసివాళ్లను డే కేర్ సెంటర్లలో వదిలేసి ఉద్యోగాలు చేసే తల్లులు పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది కనిపిస్తారు. అక్కడ తమ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటారన్న భ్రమలో బ్రతుకు బండి లాగించేస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులకు ఇదొక షాకింగ్ న్యూస్. చూసే ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేసే దారుణ దృశ్యమిది.ఇది నవీ ముంబై ఖార్గార్‌లో ఉన్న పూర్వ కేర్ సెంటర్. పాకడం, ఆకలేస్తే ఏడవడం తప్ప మరేమీ తెలియని పసి పిల్లలను చూస్తే మనిషన్నవాడికి ఎవరికైనా ముద్దొస్తారు. ఆప్యాయంగా ఎత్తుకుని లాలిస్తారు. కానీ ఇక్కడ చిన్న పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన ఆయా అఫ్సానా షేక్ అతి కిరాతకంగా, కృూరంగా, రాక్షసంగా ప్రవర్తించింది. అసలు ఏ భాషలోనూ వర్ణించలేని పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఓ పది నెలల చిన్నారిని కాలితో తన్నుతూ, చేతులతో ఈడ్చి విసిరికొడుతూ అరాచకత్వానికి పరాకాష్టగా నిలిచింది. ఆడతనానికే మచ్చతెచ్చేలా అమ్మతనానికే అవమానం కల్గించేలా ప్రవర్తించిన ఆయా తీరు మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డయింది. అఫ్సానా హింసాకాండకు ఆ చిన్నారి పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తలకు బలమైన గాయాలైనట్టు, తలలోపల అంతర్గతంగా రక్తస్రావమైందని వైద్యులు గుర్తించారు. పోలీసులు అఫ్సానాతో సహా కేర్ సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేశారు.

కేసులు, అరెస్టుల మాటెలా ఉన్నా.. ఈ ఘటనతో వర్కింగ్ మదర్స్ మాత్రమే కాదు యావద్దేశమే నిర్ఘాంతపోయింది. ఆయా అమ్మ కాకపోయినా ఫరవాలేదు, సైతాన్ల కంటే ఘోరంగా ఉంటారని ఎవరూ ఊహించలేకపోతున్నారు. పసిపిల్లల బాగోగులు చూసుకునే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఓల్డ్ ఏజ్ హోంలో, వారి చేతుల్లో ఆడుకోవాల్సిన పసిపిల్లలు డే కేర్ సెంటర్లో ఉండడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనడంలో ఎవరికీ సందేహం ఉండదు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>