Breaking News

ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందే……..!

sharif

ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతున్న పాకిస్థాన్‌ ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించినట్టు కనిపిస్తోంది. పాక్‌ భూభాగంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావాల్సి వస్తుందంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడిపై విచారణ త్వరగా పూర్తిచేయాలని, స్తంభించిపోయిన ముంబై దాడుల కేసు విచారణను తిరగదొడాలని ఆయన సైన్యానికి తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్‌ ప్రధాన పత్రిక ‘డాన్‌’ వెల్లడించింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఇటీవలి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అసాధారణరీతిలో ప్రభుత్వం సైన్యానికి పరుషమైన హెచ్చరికలు జారీచేసిందని ఈ భేటీలో పాల్గొన్న విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక గురువారం వెల్లడించింది.    నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై చర్యలు సహా కీలకాంశాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా సైన్యం నడుచుకోవాలని షరీఫ్‌ ఈ భేటీలో స్పష్టం చేసినట్టు డాన్‌ పత్రిక పేర్కొంది. పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు పూర్తిచేసేందుకు, ముంబై దాడుల కేసులో పునర్విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని షరీఫ్‌ తేల్చిచెప్పినట్టు తెలిపింది. నిషేధిత లేదా అదుపులో లేని మిలిటెంట్‌ గ్రూపులపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు తీసుకుంటే.. అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చిందని, ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేసేందుకు ఐఎస్‌ఐ చీఫ్‌ లెప్టినెంట్ జనరల్‌ రిజ్వాన్‌ అఖ్తర్‌, జాతీయ భద్రతా సలహాదారు నజర్‌ జంజువా నాలుగు ప్రావిన్సులలో పర్యటించనున్నారని ఆ పత్రిక వెల్లడించింది.జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఏకాకిని చేయాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్‌ దాడులు జరుపడంతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సార్క్‌ దేశాలు కూడా పాక్‌ తీరును నిరసిస్తూ.. ఆ దేశంలో సార్క్ సదస్సుకు హాజరుకాబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇరకాటంలో పడ్డ పాక్‌ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు.పాకిస్థాన్‌కు ఒంటరితనం అనుభవంలోకి వచ్చినట్లుంది. అందుకే ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని సైన్యానికి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జైషే మహ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని సైన్యానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘డాన్’ పత్రిక పేర్కొంది. ఈ పరిణామాలను ‘అసాధారణ మార్పు’గా అభివర్ణించింది.

ఈ సమావేశంలో పాల్గొన్న పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి మిగతావారిని దిగ్భ్రాంతికి గురి చేసినట్లు తెలుస్తోంది. ‘‘పాకిస్థాన్‌కు చైనా తన మద్దతును పునరుద్ఘాటించింది, అదే సమయంలో కాలానుగుణంగా తన ప్రాధాన్యం మారవచ్చుననే సంకేతాలను కూడా ఇచ్చింది’’ అని చెప్పడంతో సమావేశంలో ఉన్నవారంతా షాక్ తిన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని ‘డాన్’ పేర్కొంది. దీంతో షరీఫ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నూతన ధోరణిని అవలంబిస్తోందనే సంకేతాలు వస్తున్నాయని తెలిపింది.
 పంజాబ్ సీఎం అనూహ్యంగా సాహసోపేతంగా మాట్లాడారని, కొన్ని సంస్థలపై సివిల్ అధికారులు చర్యలు తీసుకున్న ప్రతిసారీ భద్రతా సంస్థలు తెర వెనుక ఉండి, అరెస్టయినవారిని స్వేచ్ఛగా వదిలేయడానికి కృషి చేస్తున్నాయని ఆరోపించారని ‘డాన్’ కథనం తెలిపింది. ఆ గది బయట ఉన్నవారు గదిలో హఠాత్తుగా వాగ్యుద్ధం జరగడాన్ని గమనించినట్లు పేర్కొంది.ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్ నేతృత్వంలో ఐఎస్ఐ ప్రతినిధి బృందం పాల్గొంది.పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం నిర్వహించిన రహస్య సమావేశంలో సైనికాధికారులకు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలేమిటంటే… ‘‘నిషేధిత లేదా సివిల్ చర్యలకు బయట ఉన్నట్లుగా ఇప్పటి వరకు పరిగణించబడుతున్న ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే సైన్యం నేతృత్వంలోని నిఘా సంస్థలు జోక్యం చేసుకోకూడదు. పఠాన్‌కోట్ విచారణను పూర్తి చేసేందుకు, స్తంభించిన ముంబై దాడుల సంబంధిత విచారణను పునఃప్రారంభించేందుకు తాజా ప్రయత్నాలు జరుగుతాయి’’.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>