Breaking News, తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా గిఫ్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం : సీఎం కేసీఆర్

kkp_4070

హైదరాబాద్: రైతులను లాభపరిచే విధంగా వారిని భాగస్వాములను చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ సిటిలను అభివృద్ది చేస్తామని ముఖ్యమంంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ విధానం సత్ఫలితాలనిచ్చిందని వెల్లడించారు. దేశంలోని చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం,పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాల కోసం అభివృద్ది పరుస్తున్నారన్నారు. తెలంగాణలో ఈ పద్ధతిని రైతులకు మరింత ఉపయోగపడే విధంగా తయారు చేస్తామని ప్రకటించారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో మూడు వేల ఎకరాలకు ఒక టౌన్ చొప్పున నిర్మిస్తామని, ఇందుకోసం రైతుల నుంచి భూమి సేకరిస్తామని వెల్లడించారు. సేకరించిన భూమికి వెలకట్టి దానికి సమానంగా సదరు లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామని చెప్పారు.  దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని, నివాస సముదాయాల లే అవుట్లలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి విధానం తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ భగావత్ ప్రాంతంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాల లే అవుట్ కు సంబంధించిన వివాదం బాధితులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఎంపి మల్లారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం స్థానిక రైతుల నుంచి 754 ఎకరాల భూమిని సేకరించింది. దీనిలో  సీవరేేజి ప్లాంటుకోసం,  మెట్రో రైలు ప్రాంగణం నిర్మాణం కోసం, వాటర్ వర్క్స్ కోసం,  సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంటు కోసం పోయిన భూమి కాకుండా మిగిలిన 430 ఎకరాలను హెచ్ఎండిఏ లే అవుట్ చేసింది. రైతుల నుంచి భూమి తీసుకునే క్రమంలో ఎకరా భూమి కోల్పోయిన రైతుకు దానికి బదులుగా అభివృద్ధి చేసిన లే అవుట్ లో 1000 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే రైతులకు ఎకరాకు వెయ్యి గజాల చొప్పున నివాస స్థలం కేటాయించారు. అయితే రైతులు ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో 54 ఎకరాలు అర్బన్ లాండ్ సీలింగ్ పరిధిలోనిదని తర్వాత తేలింది. దీంతో సదరు భూమి అమ్మిన రైతులకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎకరాకు వెయ్యి గజాలు ఇవ్వడం కుదరదని అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే తాము భూమి కొనే సందర్భంలో కానీ, ఆ భూమిని ప్రభుత్వానికి అమ్మే సందర్భంలో కానీ అది అర్బన్ లాండ్ సీలింగ్ భూమి అని తమకు తెలియదని బాధితులు 12 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. అయినా అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. ఇదే  విషయాన్ని ఇప్పుడు బాధితులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. అవగాహన లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు కూడా 60 శాతం పరిహారం (ఎకరాకు 600 గజాల చొప్పున) ఇవ్వాలని నిర్ణయించారు. పట్టా భూములు అప్పగించిన వారికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున కేటాయించడానికి ఇప్పటికే నిర్ణయం జరిగినందున వారికి కూడా నివాస స్థలం కేటాయించి మార్కింగ్ చేయాలని సిఎం చెప్పారు. మొత్తం లే అవుట్ లో ఎవరికి ఎక్కడ ఎంత స్థలం కేటాయించే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు.  నివాస స్థలాలు అప్పగించే పని కూడా దసరా లోపు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ ను, ఎంపి మల్లారెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్, ఎల్ బి నగర్ నాయకులు సుభాష్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>