Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు,

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక మౌనం

kcr3

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై వ్యూహాత్మక మౌనంలో కేసీఆర్

త‌న‌తో స‌హా మినిస్టర్స్ ని దీనిపై నోరు మెద‌ప‌వ‌ద్దంటున్న గులాబీ దళపతి

పెద్ద నోట్ల ర‌ద్దుపై కేంద్రానికి వ్య‌తిరేకంగా ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో ట‌చ్ లో ఉన్న కేసీఆర్

ఇప్ప‌టికే అఖిలేష్ యాద‌వ్, మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వారితో ట‌చ్ లో ఉన్న కేసీఆర్ సర్కారు

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై మూడో ఫ్రంట్ ఏర్ప‌డే ఛాన్స్ ఉంద‌న్న భావ‌న‌లో ముఖ్యమంత్రి

ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ లో జాతీయ డీజీపీల సమావేశం

హాజరుకానున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు

ముఖ్య అతిధులుగా హాజరుకానున్న ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్

మోడీని కలవనున్న కేసీఆర్…పెద్దనోట్ల రద్దుపై ఆయనతో చర్చించనున్న కేసీఆర్.

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై వ్యుహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై… ఇంత‌వ‌ర‌కు ఆయన స్వాగతించ‌డ‌మో.. లేక వ్య‌తిరేకించ‌డ‌మో చేయ‌లేదు. ఇప్ప‌టిదాకా అధికారికంగా దీనిపై ఎటువంటి కామెంట్ కూడా చేయ‌లేదు కేసీఆర్. కొన్ని రోజులుగా దీనిపై వేచి చూసే ధోర‌ణిలో ఉన్నారాయ‌న‌. త్వరలో ప్రధాని మోడీ హైదరాబాద్ లో జరిగే జాతీయ డీజీపీల సమావేశానికి హాజరుకానున్న నేపధ్యంలో… అప్పుడు ఆయనతో కేసీఆర్ సమావేశమై…పెద్దనోట్ల రద్దుపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పెద్ద‌నోట్ల రద్దుతో దేశ‌మంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. న‌గదు కోసం కామ‌న్ మ్యాన్ అంతా ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూ కడుతున్నారు. మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంత‌వ‌ర‌కు అధికారికంగా స్పందించలేదు. దాన్ని స్వాగతిస్తున్న‌ట్టో….లేక వ్య‌తిరేకిస్తున్నట్టో కూడా చెప్ప‌లేదాయ‌న‌. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై కేసీఆర్ ప్ర‌స్తుతం వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై అంతా గంద‌ర‌గోళం నెల‌కొంది. వాస్త‌వానికి పెద్ద‌నోట్ల ర‌ద్దు చేయ‌డంపై కేసీఆర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇప్ప‌టిదాకా త‌న అసంత్రుప్తిని ఎక్క‌డా బైట పెట్ట‌లేదు. మ‌రోవైపు స‌హ‌చ‌ర మంత్రివ‌ర్గం కూడా దీనిపై ఎటువంటి కామెంట్స్ చేయ‌డం లేదు. ప్ర‌స్తుతానికి వేచి చూసే ధోర‌ణిలో కేసీఆర్ ఉన్న‌ట్టు ఆయ‌న సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా కొన్నిసార్లు కేసీఆర్ వ్యుహాత్మ‌క మౌనం పాటించారు. ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడు కూడా కేసీఆర్ నోరు మెద‌ప‌లేదు. దాన్ని కూడా ఓ ఆయుధంలా వాడారాయ‌న‌. ప్ర‌స్తుతం అదే ప‌ద్ద‌తిని ఫాలో అవుతున్నారు కేసీఆర్.

కాగా పెద్దనోట్ల రద్దుపై ఇప్పటి దాకా నోరు మెదపని కేసీఆర్… త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లాలనే యోచన ఉన్నా… నవంబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే జాతీయ డీజీపీల సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వనున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానికి కలవడం ఆనవాయితీ. కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో జరిగే నేషనల్ డీజీపీల కాన్పెరెన్స్ కు హాజరైనప్పుడు… ఆయనతో భేటీ అయి పెద్దనోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో వివిధ రంగాలలో ఆదాయం పై పడే ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయాలని పలు శాఖలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధ్యయన నివేదికలను కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏదైనా కారణాల వల్ల ప్రధాని హాజరుకాలేకపోతే…కేంద్రానికి లేఖ రాసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

కాగా పెద్ద‌నోట్ల ర‌ద్దుపై వేచి చూసే ధోర‌ణిలో ఉన్న కేసీఆర్….ఈలోగా బీజేపీయేత‌ర రాష్ట్రాల సీఎంల‌తో కూడా చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్… ఐటీ మంత్రి కేటీఆర్ తో ఇదే విష‌యంపై మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. అలాగే మ‌రికొంత‌మంది ముఖ్య‌మంత్రులు కూడా కేసీఆర్ తో ట‌చ్ లో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే కేంద్రాన్ని ఈ విష‌యంలో నేరుగా ఢీకొట్టాల‌ని కేసీఆర్ భావించ‌డం లేదు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో దేశంలోని ఇత‌ర పార్టీల‌న్ని క‌ల‌సి మూడో ఫ్రంట్ గా ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లున్న‌ట్టు స‌మాచారం . అయితే పెద్ద‌నోట్ల ర‌ద్దు విష‌యంలో కేసీఆర్ ఎవ‌రెవ‌రితో మాట్లాడాలో వారితో ఆయ‌న మాట్లాడుతున్నార‌ని విద్యుత్ శాఖామంత్రి జ‌గదీష్ రెడ్డి చెబుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలో  కేసీఆర్ అదే చేస్తార‌ని… ఆయ‌న అంటున్నారు. మొత్తంగా మ‌రికొన్ని రోజులు ఆయ‌న ఇటువంటి మౌనాన్ని పాటిస్తార‌ని స‌మాచారం.

ఇక త్వరలోనే కేబినెట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డ‌మో… లేక‌పోతే పార్టీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల రాష్ట్ర రెవెన్యూ  ఏ విధంగా న‌ష్ట‌పోతుందో కేసీఆర్ వివ‌రిస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే దీని ప్రభావంపై మంగ‌ళ‌వారం సీఎస్ రాజీవ్ శ‌ర్మ కూడా వివిధ ‌శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.  పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌ధ్యంలో పలు రంగాల్లో ఆదాయంపై ప‌డే ప్ర‌భావాన్ని లోతుగా అధ్య‌యనం చేయాల‌ని ఆదేశించారు. అలాగే ప్ర‌తిరోజు ఈ విష‌యంపై స‌మావేశం కావాల‌ని శాఖ‌ల వారీగా స‌మావేశాలు నిర్వహించుకొని దీర్ఘకాలంలో ప‌డే ప్ర‌భావాన్ని అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>