Breaking News

హైదరాబాద్ లో హై అలర్ట్

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత భవనాలను ఖాళీ చేయించాలని అన్నారు. నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు.దాదాపు 15 ఏళ్ల తర్వాత లుంబినీ పార్కులోకి వరద నీరు చేరాయి. ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ 15 సంవత్సరాలుగా లుంబినీ పార్కులోకి వరదనీరు చేరలేదు. దీన్ని బట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీలోని ప్రధాన రహదారులన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఇక నగర శివార్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుస్సేన్‌సాగర్‌లోకి వరదనీరు భారీగా చేరుతోంది.రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అతలాకుతలం అయిన భాగ్యనగరంపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే వర్ష బీభత్సానికి పలు కాలనీలు నీట మునగగా ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, సెక్రటేరియట్, హిమాయత్‌నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఉప్పల్, తార్నాక, నిజాంపేట్, అల్వాల్, పంజాగుట్ట, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, వనస్థలిపురం, బాలానగర్‌, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్‌, చింతల్, జీడిమెట్ల, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంలో జనం అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.నాలాలోని నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కాలనీల్లోకి చొచ్చుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హుస్సేన్‌సాగర్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తుండటంతో ఎగువప్రాంతాల నుంచి వర్షపు నీరు హుస్సేన్‌సాగర్‌లోకి వెలుతోంది. హుస్సేన్‌సాగర్ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం చాలా తక్కువగా ఉంది. ఔట్‌ఫ్లో పెంచేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎసీ కమిషనర్ తెలిపారు. అయినప్పటికీ వరద నీరు అధికంగా వస్తుండటంతో హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో చుట్టపక్కల కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.నగరం అంతా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. రోడ్లపైన నిలిచిన నీరు ఇంకా తొలగించకముందే మళ్లీ వర్షం కురుస్తోంది. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి కాలనీలన్నీ నీటమునగగా మరోసారి ఇదే కుండపోత వర్షానికి హైదరాబాదీలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. డాబాలపైకి ఎక్కి తలదాచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తులు నీట మునిగాయి. మరోసారి వర్షం పడుతుండటంతో నగర ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కేవలం పది నిమిషాల్లోనే కుండపోత వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>