తెలంగాణ

రామన్న vs మనీషా

trs-party-logo

ఆదిలాబాద్ బల్దియాలో టీ ఆర్ ఎస్ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాల మద్య ఆధిపత్య పోరు ముదురుపాకాన పడడంతో పరస్పర ఫిర్యాదులతో అధికారులు, ఇంజనీర్లు నలిగిపోతున్నారు. పట్టణాభివృద్ది, సమస్యలపై ఏమాత్రం దృష్టిసారించని కౌన్సిలర్లు ప్రతి సమావేశంలోనూ పరస్పర నిందారోపణలతో సమావేశాలు సాగించడం పరిపాటిగా మారింది. గత ఏడాది మంత్రి జోగురామన్న, చైర్‌పర్సన్ మనీషాల మద్య అధిపత్య పోరు వ్యవహారం మంత్రి కెటిఆర్ వరకు వెళ్లడంతో ఇరువర్గాలను మంత్రి సముదాయించి సమస్యను సద్దుమనిగేలా చేశారు. తిరిగి ఇటీవల పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ది పనుల వ్యవహారంలో తమకు పనులు దక్కడం లేదని అలకబూనిన కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయి మున్సిపల్ కేంద్రంగా రాజకీయాలు సాగించడం ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గీయులుగా ఉన్న కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఆకస్మికంగా వేకువజామునే వార్డుల్లో తనిఖీలు చేయడం, నాసిరకం సామాగ్రి, పనులపై ఫిర్యాదు చేయడం, మరోవైపు బినామీ పారిశుద్ద్య కార్మికుల పేరుపై ప్రతినెల డబ్బులు తీసుకోవడం మున్సిపాలిటీలో అలజడి సృష్టించింది. ఈ వ్యవహారం మరింత ముదరగా రిజినల్స్ ఆండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంపై చైర్‌పర్సన్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కింద 36 వార్డుల్లో మున్సిపల్ ఇంజనీర్లు పర్యటించి కొలతలు తీసుకోవడం వెనక మంత్రి జోగురామన్న ఉద్దేశపూర్వకంగానే తమను చెక్‌పెట్టడానికి రాజకీయాలు సాగిస్తున్నారని చైర్‌పర్సన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వార్డులో 60 లక్షల విలువైన డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేయగా ఈ విషయం తమకు తెలియకుండా ఒక వర్గానికి ఇంజనీర్లు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ చైర్‌పర్సన్ వారిపై మండిపడి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేగాక తనకు సమాచారం ఇవ్వలేదని మున్సిపల్ ఇంజనీర్లు, ఇద్దరు డిఈలు, ఐదుగురు ఏఈలకు షోకాజు నోటీసులు జారీ చేయడం బల్దియాలో కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మద్య తాము నలిగిపోతున్నామని, ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కొందరూ అధికారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటే మరికొందరూ మాత్రం మంత్రి జోగురామన్న దగ్గర తమ గోడు వెల్లబోసుకున్నారు. చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాత్రం రాజకీయ పట్టుసడలకుండా తన వర్గం కౌన్సిలర్లకు భరోసా కల్పిస్తూ ప్రత్యర్థి రాజకీయాలపై అమితుమీకి సిద్దం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>